తెలంగాణ పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నియోజకవర్గమైన ములుగు అభివృద్ధిలో కీలక మైలురాయిగా తెలంగాణ రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు 9వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, స్పెషల్ ఇన్విటీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన తెలంగాణ వైల్డ్ లైఫ్ బోర్డు తొమ్మిదవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సీతక్క అటవీశాఖకు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం లభించాయి.
కంతనపల్లి, కవ్వాల్, కొండపర్తి, కొడిశెల, ఐలాపురం, పాకాల కొత్తగుడేం – దుబ్బగూడెం వరకు రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నట్లు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. పాకాల కొత్తగుడేంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చింది. తాడ్వాయి, ఏటూరు నాగరం ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక సఫారీ వాహనాలకు పర్మిషన్ ఇచ్చింది. ములుగు ప్రాంత అభివృద్ధికి సహకరించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు, వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.