వరి వేలంలో కుంభకోణం అంటున్న ప్రతిపక్షాలు.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

రబీ 2022-23 మార్కెటింగ్‌లో వరి ధాన్యం వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 800 కోట్ల నుండి రూ. 1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ నాయకుడు ఎ మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆరోపించడంతో తెలంగాణలో వరి సేకరణపై వివాదం నెలకొంది.

By Medi Samrat  Published on  28 May 2024 8:22 AM IST
వరి వేలంలో కుంభకోణం అంటున్న ప్రతిపక్షాలు.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

రబీ 2022-23 మార్కెటింగ్‌లో వరి ధాన్యం వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 800 కోట్ల నుండి రూ. 1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ నాయకుడు ఎ మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆరోపించడంతో తెలంగాణలో వరి సేకరణపై వివాదం నెలకొంది. అయితే ఎలాంటి స్కామ్, ఎలాంటి తప్పు చేయలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొట్టిపారేశారు. రూ.200 కోట్ల ధాన్యం మాత్రమే ఇప్పటివరకు కొనుగోలు జరిగిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మరి ధాన్యం కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదని మంత్రి ఉత్తమ్‌ కుమార్ హితవు పలికారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డినని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే అస్సలు ఊరుకోనని హెచ్చరించారు.

రబీ 2022-23 మార్కెటింగ్ సీజన్ నుండి రైస్ మిల్లుల్లో పడి ఉన్న బియ్యాన్ని వేలం వేయడానికి గ్లోబల్ టెండర్ల ఆధారంగా అమ్మడానికి ప్రయత్నించారు. ఎఫ్‌సిఐకి అందజేయాల్సిన 35 లక్షల టన్నుల వరి మిల్లుల వద్ద పడి ఉంది. ఇది అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి కాగా.. అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైస్ మిల్లులలో పడి, వరి రంగు మారి, మొలకెత్తింది, మానవ వినియోగానికి పనికిరానిదిగా గుర్తించారు. ఈ ఒప్పందం ప్రకారం క్వింటాల్‌కు రూ.2,007కు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (టీజీఎస్‌సీఎస్‌సీ) నుంచి వరి కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్ల కోసం నాలుగు కంపెనీలు బిడ్‌ను గెలుచుకున్నాయి. నాలుగు కంపెనీలకు చెల్లించిన తర్వాత మిల్లుల నుంచి ఆ ధాన్యాన్ని ఎత్తివేయడానికి విధించిన గడువు 90 రోజులు ముగిసింది. గత ప్రభుత్వంలో క్వింటాల్‌ ధాన్యం ధర రూ.1700 వచ్చిందని, తమ ప్రభుత్వంలో క్వింటాల్‌ ధాన్యం ధర రూ.2007 పలికిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులకు రూ.1,100 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

Next Story