బీసీలకు ప్రయోజనం దక్కకుండా ఆ పార్టీ రాజకీయం చేస్తుంది: భట్టి
దేశంలో ఇప్పటివరకు బీసీ జన గణన సైంటిఫిక్‌గా తేల్చలేదని..మొదటిసారి తేల్చింది తెలంగాణ ప్రభుత్వమే అని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik
బీసీలకు ప్రయోజనం దక్కకుండా ఆ పార్టీ రాజకీయం చేస్తుంది: భట్టి
దేశంలో ఇప్పటివరకు బీసీ జన గణన సైంటిఫిక్‌గా తేల్చలేదని..మొదటిసారి తేల్చింది తెలంగాణ ప్రభుత్వమే అని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అది జరగకూడదనే ఉద్దేశంతో కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేస్తున్నాయని.. దీన్ని బీసీ కుల సంఘాలు అర్థం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి పిలుపునిచ్చారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా కులగణన చేశామన్నారు. సర్వేలో పాల్గొనని వారికోసం మరో అవకాశం ఇచ్చామన్నారు. ఈ వివరాలు వచ్చాక వచ్చిన లెక్కలు అప్ డేట్ చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణనపై అనుమానాల నివృత్తికి ఇవాళ ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం సమావేశం అయింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు నరేందర్ రెడ్డితో పాటు బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీసీ కులగణన జరగడం ఇష్టం లేని కొందరు ముస్లిం మైనార్టీలను బీసీల్లో ఎలా చూపుతారని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం కొన్ని ముస్లింమైనార్టీ కులాలు బీసీల్లో ఉన్నాయని దాని ప్రకారమే ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొన్న వారిది ఏ కులమో ఆ కులంలో నమోదు చేశారని స్పష్టం చేశారు. ఇవేమి మేము కొత్తగా ఇచ్చిన జీవో కాదన్నారు. ఈ ఆరోపణలు చేస్తున్నవారు ఆ జీవోలు చూడలేదేమో అని ఎద్దేవా చేశారు. అలాగే ఓసీల జనాభా పెరిగిందనే చర్చ జరుగుతోంది. వలసల్లో భాగంగా చాలా కాలంగా అర్బన్ ప్రాంతాల్లోకి మార్వాడీలు, ఇతర ఓసీలు నివాసం ఉంటున్నారు. వారి జనాభా ఓసీల్లో వస్తారని అందువల్లే ఓసీ జనాభా పెరిగిందన్నారు. కులగణన సర్వేపై ఎవరు ఏ ప్రశ్న అడిగినా.. అధికారికంగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని ఆధారాలు అధికారికంగా నిక్షిప్తం చేశాం. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.