Telangana: 'ఖాళీ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు'.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే తేదీని తెలియజేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 July 2023 3:44 AM GMTTelangana: 'ఖాళీ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు'.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్: గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే తేదీని తెలియజేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 220 సర్పంచ్‌లు, 94 ఎంపీటీసీలు, 4 జడ్పీటీసీలు, 5,364 వార్డు సభ్యులు, 344 ఉప సర్పంచ్‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో నివసించే ప్రజలు తమ జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు దూరమవుతున్నారు.
కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 24న భారత ఎన్నికల సంఘం, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు డివిజన్ బెంచ్ ఇదే విధమైన నోటీసులు జారీ చేసింది.
మంగళవారం ఈ పిటిషన్ మళ్లీ విచారణకు వచ్చింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఈ పిఐఎల్‌కు హాజరై ఎన్నికల తేదీలను కోర్టుకు తెలియజేస్తారనే కారణంతో పంచాయతీరాజ్ శాఖ జిపి నజీర్ అహ్మద్ ఖాన్ మరింత సమయం కోరారు. జిపి వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుందని పేర్కొంటూ పిల్‌ను జూలై 28కి వాయిదా వేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ కమిషనర్‌లను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది రాపోలు బాస్కర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని డివిజన్ బెంచ్ విచారించింది.