బాయిల్డ్‌ బియ్యం కొనం.. మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం

The central government has decided not to take para boiled rice. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పారా బాయిల్డ్‌ బియ్యం కొనలేమని తెలిపింది.

By అంజి  Published on  18 Nov 2021 12:14 PM
బాయిల్డ్‌ బియ్యం కొనం.. మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం

వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పారా బాయిల్డ్‌ బియ్యం కొనలేమని తెలిపింది. దేశంలో బియ్యం, గోధుమ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వరి, గోధుమ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను రైతులు వేయాలని సూచించింది. నూనె, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా పండించాలని, అన్ని రాష్ట్రాలకు ఇవే సూచనలు చేస్తున్నామని వివరించింది. రబీ సీజన్‌ ఇంకా మొదలు కాలేదని.. రబీ ధాన్యం సేకరణపై అన్ని రాష్ట్రాలతో చర్చించాలని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.

వచ్చే సంవత్సరం ఎంత బియ్యం సేకరించాలని త్వరలోనే నిర్ణయిస్తామని వివరించింది. ఒక్కో రాష్ట్రం నుండి ఒక్కో విధంగా డిమాండ్ ఉంటుందని కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. ఇక గత నిర్ణయాల ప్రకారం.. ఇప్పటి వరకు బాయిల్‌ బియ్యం సేకరించామని, ఇకపై కొనమని తేల్చి చెప్పింది. ధాన్యం కొనుగోలుపై దేశీయ అవసరాలు, ఎగుమతుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. ఎగుమతి అవకాశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని, ఎగుమతుల్లో కూడా కొన్ని పరిమితులు ఉంటాయని తెలిపింది.

రైతులు నూనె, పప్పు ధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలు ఎక్కువగా సాగా చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్రాలు ధాన్యం సేకరించేంత వరకే పరిమితం కావాలని పేర్కొంది. ఇది వరకు తెలంగాణలో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ, 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్రం వివరించింది. అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపిన తర్వాతే.. బియ్యం కొనుగోళ్లపై నిర్ణయాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Next Story