హైదరాబాద్: సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా తమ బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 'నెట్‌వర్క్ టు సైట్' పేరుతో సరోజిని దేవి కంటి ఆసుపత్రితో టీజీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ మెహిదిపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్..ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్రదాతల నుంచి సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్‌కు పంపిస్తారు. సేకరించిన కార్నియాలను ఐస్ బాక్స్‌లో భద్రపరిచి ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందజేస్తారు. వాటిని తమ బస్సుల్లో హైదరాబాద్‌కు ఆర్టీసీ డ్రైవర్లు తీసుకువస్తారు. బస్సులు హైదరాబాద్ చేరుకోగానే సరోజిని కంటి ఆసుపత్రి సిబ్బంది వచ్చి వాటిని తీసుకుని ఐ బ్యాంక్‌లో భద్రపరుస్తారు.
టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మాట్లాడుతూ.. పవిత్రమైన ఈ దాతృత్వ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు. నెట్‌వర్క్ టు సైట్ పై ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మృతి చెందాక అత్యంత విలువైన అవయవాలను మట్టిపాలు చేసేకన్నా అంధత్వంతో లోకాన్ని చూడలేని వారికి చూపునీయడం గొప్పకార్యమని ఆయన అన్నారు. భారతదేశంలో ప్రతి ఏటా 3 లక్షలకు పైగా మంది నేత్రాల కోసం ఎదురుచూస్తుంటే.. కేవలం 18 వేల మార్పిడిలు మాత్రమే జరుగుతున్నాయని గుర్తుచేశారు. మరణాంతరం నేత్రదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.