గుడ్‌న్యూస్‌.. బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు

బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది.

By -  Medi Samrat
Published on : 18 Sept 2025 4:29 PM IST

గుడ్‌న్యూస్‌.. బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు

బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెష‌ల్ బ‌స్సుల‌ను బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 స్పెష‌ల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని క‌ల్పించింది. ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు ప్ర‌త్యేక బ‌స్సులను న‌డ‌ప‌నుంది. సద్దుల బ‌తుకమ్మ ఈ నెల 30న‌, దసరా అక్టోబ‌ర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్ల‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముండ‌టంతో ఆ మేర‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది.

హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు న‌డుపుతోంది.

దసరా స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌లను సంస్థ సవరించనుంది. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదివరకు వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదిల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. అవి యధావిధిగా ఉంటాయి.

“బ‌తుకమ్మ‌, ద‌స‌రా పండుగ‌ల దృష్ట్యా ప్ర‌జ‌ల‌కు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సంసిద్ధంగా ఉంది. గ‌త ద‌స‌రా కంటే ఈ సారి అద‌నంగా 617 ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాటు చేశాం. ర‌ద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్, త‌దిత‌ర ప్రాంతాల్లో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్టంను ఏర్పాటు చేయాలని క్షేత్ర‌స్థాయి అధికారుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశాం. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు. పోలీస్, ర‌వాణా, మున్సిపల్ శాఖల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాల‌కు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోంది.” అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.

పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని ఆయన సూచించారు. టీజీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు.

బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

Next Story