మేక కసాయిని నమ్మినట్లే.. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు: కేటీఆర్

'మేక కసాయిని ఎలా నమ్మిందో తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేశారని' భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కేటీ రామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు.

By అంజి  Published on  10 March 2024 12:23 PM GMT
Telangana, Telangana people, Congress, KTR

మేక కసాయిని నమ్మినట్లే.. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు: కేటీఆర్

హైదరాబాద్: ' మేక కసాయిని ఎలా నమ్మిందో తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేశారని' భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కేటీ రామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. ''అవాస్తవిక వాగ్దానాలు చేసి కేసీఆర్‌ను ఓడించారు. పొంక‌నాల పోతిరెడ్డి లాగా ఎన్నో మాట‌లు చెప్పిండు రేవంత్ రెడ్డి. రూ. 2 ల‌క్ష‌ల రుణం తెచ్చుకుంటే డిసెంబ‌ర్ 9న మాఫీ చేస్తాన‌ని పొంక‌నాల పోతిరెడ్డి న‌రికిండు. డిసెంబ‌ర్ 9, జ‌న‌వ‌రి 9, ఫిబ్ర‌వ‌రి 9 పాయే.. మార్చి 9 కూడా పీకింది. ఇప్పుడు మ‌నం యాది చేస్తే.. ఏవేవో మాట్లాడుతున్నారు. మీరు (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మీ హామీలన్నింటినీ నెరవేర్చకపోతే, తెలంగాణ మహిళలు, ప్రజలు మీకు గుణపాఠం చెబుతారు'' అని కేటీఆర్‌ అన్నారు. మార్చి 10వ తేదీ ఆదివారం కామారెడ్డిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఓటమిని గుర్తిస్తూ గతంలో ఉన్న చేదును మరిచి ముందుకు సాగాలని కార్యకర్తలను కేటీఆర్ కోరారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ మాజీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ నేతృత్వంలో జిల్లాలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారని, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ, రాష్ట్ర నేతలు డి శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ రాజకీయాల్లోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు.

“అవును, మా నాన్న పేరు కేసీఆర్. నేను ఆందోళన (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు) ద్వారా రాజకీయాల్లోకి వచ్చాను. నేను మీలాగా బూట్‌లు నొక్కుతూ, ఆంధ్రా నాయకుల బ్యాగులు పట్టుకుని రాజకీయాల్లోకి రాలేదు. నేను సిరిసిల్ల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను...అవును మా నాన్న ఉద్యమ నాయకుడు, ఆయనే తెలంగాణ బాపు ” అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Next Story