కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశాన్ని తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన సమావేశంలో.. సాగర్, కృష్ణా డెల్టా కింద సాగు, తాగు నీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ స్పష్టం చేశారు. జలవిద్యుత్ ఉత్పత్తిపై కేఆర్‌ఎంబీ ఛైర్మన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు.
కృష్ణా జలవివాదలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం ఇవాళ కేఆర్‌ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో జరిగింది. బోర్డు ప్రతినిధులతో పాటు, రెండు రాష్ట్రాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2021-22 సంవత్సరానికి కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు వాటా విషయమై సమావేశంలో చర్చ జరిగింది. జలవిద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక మొదటినుండి నీటి వాటాలో తెలంగాణ 50:50 అంటూ పట్టు పట్టగా.. 70:30 కావాలని ఏపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే.