స్వాగతిస్తున్నాం.. కానీ ప్రభుత్వమే కాపాడాలి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది.
By Medi Samrat Published on 11 Dec 2023 3:00 PM GMTతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో మహిళలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆటో డ్రైవర్లు మాత్రం తాము చాలా నష్టపోతున్నామంటూ తమ బాధను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. ఆటోడ్రైవర్ల కష్టాలపై చర్చించారు.
హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఏఐటీయుసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత పథకాన్ని స్వాగతిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆటో మీటర్ల చార్జీలు పెంచారని, పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 7 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని, కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు స్వయం ఉపాధి పథకాలు అందించాలని కోరారు. తమ సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోతున్నారు. చాలా ప్రాంతాల్లో ఆటో స్టాండ్ లలో ఆటోలు ట్రిప్ లు లేకుండా ఖాళీగా ఉంటున్నాయి.