తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది. మార్చి 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. విద్యాశాఖ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట విధానంలోనే నడుస్తాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. తరగతులు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి.