Rajiv Yuva Vikasam : రూ. 50 వేలలోపు యూనిట్లకు 100 శాతం సబ్సిడీ.. మ‌రి రూ. 4 లక్షలకైతే..

తెలంగాణలో 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని అమలు చేయనున్నారు.

By Medi Samrat
Published on : 26 March 2025 9:22 AM IST

Rajiv Yuva Vikasam : రూ. 50 వేలలోపు యూనిట్లకు 100 శాతం సబ్సిడీ.. మ‌రి రూ. 4 లక్షలకైతే..

తెలంగాణలో 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని అమలు చేయనున్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇబిసి (ఈడబ్ల్యుఎస్) వర్గాలకు స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం 'రాజీవ్ యువ వికాసం'. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకానికి మార్చి 15, 2025 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా, ఏప్రిల్ 4, 2025 వరకు అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చే ఈ పథకానికి రూ.6,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వ్యవసాయేతర పథకాలకు జులై 1, 2025 నాటికి 21-55 ఏళ్ల మధ్య వయసు, వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21-60 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

మార్గదర్శకాల ప్రకారం.. దరఖాస్తుదారు ప్రతిపాదించిన యూనిట్ ధర ఆధారంగా ఈ పథకం వివిధ స్థాయిలలో సబ్సిడీని అందిస్తుంది:

₹50,000 వరకు ఖరీదు చేసే యూనిట్లకు, ప్రభుత్వం 100 శాతం సబ్సిడీని అందిస్తుంది. ₹50,001 మరియు ₹1 లక్ష మధ్య ఖరీదు చేసే యూనిట్లకు ఇది 90 శాతం, మిగిలిన 10% బ్యాంకు రుణాల ద్వారా నిధులు సమకూరుస్తుంది. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు 80%, రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు 70% రాయితీ ఇవ్వనున్నారు. అయితే కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్‌ 5. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే 21 నుంచి 31 వరకు మంజూరు చేస్తుంది. జూన్‌ 2 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ అవుతాయి.

Next Story