హైదరాబాద్: సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట 'రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా?' అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ''తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా? ఉద్యమస్ఫూర్తిని ఊపిరితీస్తారా? ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా? మళిదశ పోరాట దిక్చూచిని దెబ్బతీస్తారా? అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ? తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్ఛమైన స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా? ''అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ను తెలంగాణ క్షమించదు అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం ఆవిష్కరించనున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS) మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇది జరగనుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతానికి కాంగ్రెస్ నేతలు చురుగ్గా సహకరించాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
ఆగస్టులో, సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) మధ్య మాటల గొడవ జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఈ స్థలాన్ని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మొదట కేటాయించింది. ఇది ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదానికి దారితీసింది.