తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం లబించింది. కేటీఆర్ అమెరికాలో ఏడు రోజుల పాటు పర్యటించనున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్.. ఆదివారం ఉదయం లాస్ ఏంజెల్స్ చేరుకున్నారు. లాస్ ఏంజెల్స్‌లో మంత్రి కేటీఆర్‌కు ఎన్నారైలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నారైలతో కొద్దిసేపు మాట్లాడిన మంత్రి.. రాష్ట్ర అభివృద్ధిపై వారితో చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన చిన్నారులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అంబాసిడర్లుగా వ్యవహరించాలని కోరారు.
పర్యటనలో భాగంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఇదిలావుంటే.. కేటీఆర్ తన అమెరికా పర్యటన గురించి ట్వీట్ చేస్తూ, "ఐదేళ్ల తర్వాత పని నిమిత్తం అమెరికాకు వెళుతున్నాను. వచ్చే వారం జగనున్న వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రయాణం అన్ని విధాల సఫలమవుతుందని భావిస్తున్నానని ట్వీట్ చేశారు.