కాంగ్రెస్‌లో గెలిచేవారు బీజేపీలోకి వెళ్లిపోతారు: మంత్రి కేటీఆర్

కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  5 Oct 2023 10:28 AM GMT
Telangana, Minister KTR, Fire,  Congress, BJP,

 కాంగ్రెస్‌లో గెలిచేవారు బీజేపీలోకి వెళ్లిపోతారు: మంత్రి కేటీఆర్

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టికెట్‌ దక్కినవారంతా ప్రజల్లోకి వెళ్లి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈసారి అయినా బీఆర్ఎస్‌ను ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ భారీ ఎత్తున హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షిస్తోంది. బీజేపీ కూడా అధికారపార్టీపై విమర్శలు చేస్తూ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారం ఇచ్చినప్పుడు కాంగ్రెస్‌ ఏం చేయలేకపోయిందని అన్నారు. ఇవాళ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తోందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.

అయితే.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో డబుల్‌బెడ్రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమలుకు వీలుకాని హామీలు ఇస్తూ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ ప్రలోభ పెడుతోందని అన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నాయకులు చెప్పినవి చేయరు అని.. గతంలోనూ ఇలానే చేశారని అన్నారు. మోసాన్ని మోసంతోనే జయించి ఓటు బీఆర్ఎస్‌ అభ్యర్థులకు వేయాలని కోరారు కేటీఆర్. బీజేపీ వారికి అదానీ నుంచి పైసలు బాగా వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలను దబాయించి పైసలు అడగాలని ప్రజలకు చెప్పారు. అయితే.. రైతుబంధు అందితేనే.. కల్యాణ్యలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు వస్తేనే బీఆర్ఎస్‌కు ఓటువేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో ఎన్నో మంచి పనులు చేసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. షాద్‌నగర్‌కు నీళ్లు ఇచ్చే కేసీఆర్‌ అని చెప్పారు. తెచ్చేది అంజయ్యయాదవ్‌ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఒక గాడ్సే అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కడుపులో గుద్ది.. నోట్లో చాక్లెట్ పెడతారని విమర్శించారు. బీజేపీ నాయకులు అయితే నీటివాటా తేల్చడం లేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ప్రాజెక్టులపై కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకునే వంకరబుద్ది ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. రేవంత్‌రెడ్డి ఆర్ఎస్‌ఎస్‌ మనిషి అని కాంగ్రెస్‌ నేతలే చెప్పారని.. ఈ విషయం పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్‌ సోనియాకు లేఖ రాశారని అన్నారు. రేవంత్‌రెడ్డి బీజేపీతో కలిసిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినవారు బీజేపీలో చేరుతారని ఘాటు విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్.

Next Story