కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి సహాయసహకారాలు అందించడం లేదని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కేంద్రం సాయం చేయడం లేదని విమర్శించారు. తాజా వరదల కారణంగా రూ. 1,400 కోట్ల నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనా వేసి, తక్షణ సాయంగా రూ. 1,000 కోట్లు ఇవ్వాలని కోరినప్పటికీ... కేంద్రం నుంచి స్పందనే లేదని ఆయన అన్నారు. రాష్ట్రాలను ఆదుకోవాల్సిన కేంద్రం ఆ బాధ్యతలను విస్మరిస్తోందని చెప్పారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.