ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ పలు రాష్ట్రాల విద్యార్థులను మోసం చేసిన ఓ వ్యక్తిని బెలగావి నగర పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన అరవింద అరగొండ ప్రకాశం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.12 లక్షల నగదు లభించింది.
ప్రకాశం 2023లో బెలగావి నగరంలో నీట్ కోచింగ్ సెంటర్ ని స్థాపించాడు. తక్కువ నీట్ స్కోర్లు ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారికి MBBS సీట్లు ఇప్పిస్తానని వాగ్దానం చేశాడు. స్థానిక యువకులను సంప్రదించి విద్యార్థులను ఆకర్షించాడు. బెల్గామ్‌లో కనీసం 10 మంది విద్యార్థులు అతని మోసానికి బలి అయ్యారు. ఒక్కొక్కరు కనీసం రూ. 20 లక్షలు చెల్లించారు. మోసపోయిన బీదర్‌కు చెందిన విద్యార్థిని అరవింద అరగొండ ప్రకాశంపై ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో అతడు తప్పుడు గుర్తింపుతో కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నట్లు తేలింది. అక్కడి నుండి పారిపోయిన అరవింద కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు, చివరికి ముంబైలో అతనిని గుర్తించింది. అనంతరం బెళగావికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.
ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులను కూడా ప్రకాశం ఇలానే మోసం చేసినట్లు తెలుస్తోంది. అతడిపై తెలంగాణలో ఆరు కేసులు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒకటి, బెంగళూరులో రెండు కేసులు అశోకా నగర్, ఆర్‌టి నగర్ పోలీస్ స్టేషన్‌లలో ఉన్నాయి. విచారణ కొనసాగుతోందని, బాధిత విద్యార్థులకు, వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.