అవయవ దానాల్లో దేశంలోనే తెలంగాణ, మహారాష్ట్రలు టాప్ లో ఉన్నాయి. అవయవదానం అనే గొప్ప యజ్ఞంలో 2021, 2022లో దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. లోక్‌సభలో వెల్లూరు ఎంపి డిఎం కతీర్ ఆనంద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో చురుకైన రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి అని కేంద్ర మంత్రి కూడా చెప్పారు. ఇక భారతదేశంల అర్హులైన రోగులకు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను సులభతరం చేయడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుందని.. అవయవదానంపై అవగాహన పెంచడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆమె అన్నారు.
అవయవ మార్పిడి కోసం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక బహుళ అవయవ మార్పిడి కేంద్రాన్ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం 35 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్రెయిన్ డెడ్ అయిన రోగులు దానం చేసిన అవయవాలను రవాణా చేయడానికి విమానాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తోంది.