తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఈరోజు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ప్రకటించింది. దీంతో విద్యార్ధులకు ఫలితాలు వెబ్‌సైట్‌లలో అందుబాటులోకి వచ్చాయి. ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ సంవత్సరంలో 60.01 శాతం, ద్వితీయ సంవత్సరంలో 64.18 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు తమ ఫలితాలను TSBIE అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 980,978 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 478,718 మంది ప్రథమ, 502,260 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు ఉన్నారు. పరీక్షల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 16 స్పాట్ మూల్యాంకన శిబిరాల్లో జవాబు పత్రాల మూల్యాంకనం జరిగింది.