కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు అయిన నిజామాబాద్ రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్ పై తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. పత్రికలు, ప్రసార సాధనాల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసుకున్న తెలంగాణ హెచ్ఆర్సీ.. పోలీసులను ఈ ఘటనపై నివేదిక కోరింది.
పోలీస్ కానిస్టేబుల్ ఎం. ప్రమోద్ కుమార్ హత్యకు సంబంధించి రియాజ్ ను ఇటీవల అరెస్టు చేసి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో రియాజ్ సాయుధ రిజర్వ్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించి దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా..రియాజ్ చనిపోయాడని పోలీసుల కథనం. ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్థితులు, ఏదైనా మెజిస్టీరియల్ లేదా జ్యుడీషియల్ విచారణ స్థితి, ఎన్‌కౌంటర్ మరణాలపై సుప్రీంకోర్టు, ఎన్.హెచ్.ఆర్.సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎఫ్ఐఆర్, పోస్ట్‌మార్టం నివేదిక కాపీలతో సహా నవంబర్ 24వ తేదీ నాటికి నివేదిక సమర్పించాలని హెచ్ ఆర్సీ తెలంగాణ డీజీపీని ఆదేశించింది.
ఇదిలావుంటే.. పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు బోధన్ రోడ్డులో గల స్మశాన వాటికలో రియాజ్ అంత్యక్రియలు పూర్తి చేశారు.