హైదరాబాద్: పట్టణాల్లోని రైతు కూలీలకూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలనే వినతిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి భూమి లేని రైతు కూలీలను ఆదుకునేందుకు ఉద్దేశించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని గ్రామాల్లోని కూలీలకు మాత్రమే వర్తింపజేస్తున్నారని, మున్సిపాలిటీల పరిధిలో ఉండే వారికి అన్యాయం జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
నారాయణపేట్ జిల్లా దామరగిద్ద మండలం బాపన్‌పల్లికి చెందని జి.శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజాయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ఈ పథకానికి సంబంధించిన జీవో పంచాయతీరాజ్ శాఖ జారీచేసిందని, అది మున్సిపాల్టీలకు వర్తించబోదని తెలిపింది. కాగా గతంలో మున్సిపాలిటీల్లో పలు గ్రామాలను విలీనం చేశారని, రైతు కూలీలందరినీ ఒకేలా చూడాలని పిటిషనర్లు కోరారు.