హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ప్రశంసలు
: పర్యావరణహితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు గురువారం అభినందించింది
By Knakam Karthik
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ప్రశంసలు
హైదరాబాద్: పర్యావరణహితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు గురువారం అభినందించింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, రహదారులు, పార్కులను కాపాడేందుకు హైడ్రా వంటి సంస్థలు అవసరముందని పేర్కొంది. రహదారులపై రాకపోకలకు ఆటంకంగా నిర్మించిన వాటిని తొలగించే విషయంలో హైడ్రా అవసరముందంటూ జస్టిస్ విజయశేన్ రెడ్డి వాఖ్యానించారు. రాంనగర్ మనెమ్మ గల్లీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోడ్డు ఆక్రమణపై జీహెచ్ ఎంసీకి గతంలో ఫిర్యాదు చేసింది. హైడ్రా సహకారాన్ని జీహెచ్ ఎంసీ కోరింది.
దీంతో హైడ్రా రంగంలోకి దిగి.. జమినిస్తాన్పూర్, రామ్ నగర్ క్రాస్ రోడ్స్లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని హైడ్రా తొలగించింది. దీంతో రామ్ నగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు అవకాశం లభించింది. అయితే ఈ విషయమై.. రోడ్డుపై వాణిజ్య సముదాయాన్ని నిర్మించిన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు గురువారం విచారణకు రాగా.. జస్టిస్ విజయశేన్ రెడ్డి పై విధంగా వ్యాఖ్యానించారు. రహదారులను ఆక్రమించేసి రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలను తొలగించడంలో HYDRAA వంటి సంస్థలు ముఖ్యమైనవని హైకోర్టు పేర్కొంది. ఎప్పుడైనా ప్రజా ప్రయోజనాలకు లోబడి ప్రైవేట్ ప్రయోజనాలు ఉండాలని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా ఆస్తులు, నీటి వనరులను కాపాడడంలో నగరం అంతటా HYDRAA చేస్తున్న కార్యక్రమాలను హైకోర్టు ప్రశంసించింది .