నోట‌రీ స్థలాల రిజిస్ట్రేష‌న్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి షాక్

నోటరీ స్థలాల క్రమబద్దీకరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు అభ్యంతరం తెలిపింది.

By Medi Samrat  Published on  25 Sept 2023 7:30 PM IST
నోట‌రీ స్థలాల రిజిస్ట్రేష‌న్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి షాక్

నోటరీ స్థలాల క్రమబద్దీకరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. నోటరీ స్థలాల రిజిస్ట్రేషన్‌లకు అనుమతిస్తూ ఈ ఏడాది జులై 26న తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 84 విడుదల చేసింది. ఈ జీవోపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని నోట‌రీ స్థలాల రిజిస్ట్రేష‌న్లు ఆగిపోనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కొన్ని భూములు నోటరీ ద్వారా కొనుగోళ్లు జరగగా.. అలాంటి స్థలాలను తగిన స్టాంప్ డ్యూటీ చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్.84 ద్వారా అవకాశం ఇచ్చింది.

ఈ జీవోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. జీవో నెం.84ను పూర్తిగా పరిశీలించిన ధర్మాసనం ఈ అంశంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story