మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పారు
By Knakam Karthik
మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, దీనిలో భాగంగానే స్టాంప్ డ్యూటీ తగ్గించాలనే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2021లో భారతీయ స్టాంపుల చట్టంలో నాలుగు సెక్షన్లు, 26 ఆర్టికల్స్‌పై శాసనసభలో సవరణ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపగా పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
వాటిపై వివరణలు పంపినా 2023లో ఆ బిల్లును తిరిగి రాష్ట్రానికి పంపింది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల చట్టంలో చేయాల్సిన సవరణలపై సచివాలయంలో శనివారం సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూశాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్, న్యాయ వ్యవహారాల కార్యదర్శి తిరుపతి, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా 2025 సవరణ బిల్లును తీసుకురావాలని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రవేశ పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ చేపట్టాలని, మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా సవరించాలన్నారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త, పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ ఒకే విధంగా ఉంటుందని, పాతవాటి రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణనలోకి తీసుకుని స్టాంప్ డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, పాత అపార్ట్‌మెంట్ల స్టాంప్ డ్యూటీ తగ్గింపు అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.