ప్రతి రైతుకు ఫార్మర్‌ ఐడీ కార్డు.. రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫార్మర్‌ ఐడీ' విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది.

By అంజి
Published on : 4 May 2025 8:28 AM IST

Telangana govt, Farmer ID project, Central Government, Telangana

ప్రతి రైతుకు ఫార్మర్‌ ఐడీ కార్డు.. రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫార్మర్‌ ఐడీ' విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. ప్రతి రైతుకు డిజిటల్‌ గుర్తింపు కార్డు జారీ చేస్తారు. 11 నంబర్ల ఐడీలో రైతు పేరు, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌, పాస్‌బుక్‌ వివరాలు, భూమి రకం, సర్వే నంబర్లు, సాగు చేసిన పంట తదితర వివరాలు ఉంటాయి. కేంద్ర పథకాలపై కిసాన్‌ నిధి, ఫసల్‌ బీమా, సాయిల్‌ హెల్త్‌ కార్డుకు ఈ కార్డు తప్పనిసరి లేకపోతే ఆయా పథకాలు అందవు. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్‌‌టెన్షన్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ​ప్రక్రియను ప్రారంభించనుంది. రైతుల భూమి వివరాలను వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేస్తారు.

యాప్‌‌‌‌‌‌‌‌లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత, రైతు మొబైల్‌‌‌‌‌‌‌‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని యాప్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయగానే 11 అంకెల ఫార్మర్ ఐడీ జనరేట్ అవుతుంది. 'డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ' కింద వ్యవసాయ రంగానికి డిజిటల్ గుర్తింపు కార్డుల కోసం కేంద్రం కృషి చేస్తోంది. ఇది వివిధ డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఒక గొడుగు పథకంగా రూపొందించబడింది. ఆధార్ కార్డు మాదిరిగానే ఉండే.. ఈ రైతు కార్డు.. రైతులకు విశ్వసనీయ డిజిటల్ గుర్తింపుగా ఉపయోగపడుతుంది. ఈ కార్డు.. ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడీ అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

Next Story