రేపు వ్యాక్సినేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీపావళి పండగను పరస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో కొవిడ్ -19 వ్యాక్సినేషన్ వైద్య సిబ్బందికి కాస్తా విరామం దొరికింది. మళ్లీ నవంబర్ 5వ తేదీ నుండి యధావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ సాగుతోంది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తర్వాత.. మహమ్మారి కరోనా విజృంభణన తగ్గుముఖం పట్టింది.
ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. థర్డ్ వేక్ రాకముందే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేలా ఇప్పటికే ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. మొబైల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ శానిటైజ్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు పండగ సందర్భంగా బాణాసంచా వెలిగించే ముందు చేతులకు శానిటైజర్లను ఉపయోగించవద్దని అధికారులు తెలిపారు. శానిటైజర్లలలో ఉండే ఆల్కహాల్‌కు మండే అవకాశం ఉంది. కనుక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో నిన్న 167 మందికి కరోనా పాజటివ్ నిర్దారణ అయ్యింది. 37,941 మందికి కరోనా పరీక్షలు చేయగా 167 మందికి పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్ మహా నగరంలో కొత్తగా 66 కేసులు నమోదు అయ్యాయి. భూపాలపల్లి, ములుగు, నారాయణపేట, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఒక కొత్త కేసు కూడా నమోదు కాలేదు. తెలంగాణలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3,959కి పెరిగింది.