రైతుకు మాత్రం ఆ అవకాశం లేదు.. సీఎం రేవంత్
ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారు.. కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదని.. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By - Medi Samrat |
ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారు.. కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదని.. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చిందన్నారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువ అన్నారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పకడ్బందీ చట్టం తీసుకొచ్చిందన్నారు.
రూపాయి కిలో బియ్యం పథకం విజయభాస్కర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని.. కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదు.. ఆ తరువాత ఎన్టీఆర్ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లారు.. అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందని గుర్తుచేశారు. రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది.. నలభై ఏళ్లుగా ఇదే పథకం కొనసాగుతోంది.. ఆనాటి నుంచి దొడ్డు బియ్యమే ఇస్తూ వచ్చారు. దొడ్డు బియ్యం తినేవారు లేక ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయింది.. దొడ్డు బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి ఖర్చు తప్ప.. పేదలకు ఉపయోగపడటం లేదని గ్రహించాం.. అందుకే పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించామన్నారు. ఇందుకోసం రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ అందించి సన్నవడ్లు పండించాలని ప్రోత్సహించామన్నారు. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని.. భవిష్యత్‌లో ఇది 90 శాతం కూడా కావచ్చన్నారు. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు అందించాం.. రైతులకు లాభం చేకూర్చడమే కాదు.. పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు.
సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గిందన్నారు. పౌరసరఫరాల మంత్రి, శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైందన్నారు. నేటితో సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయిందన్నారు. మా నెక్ట్స్ టార్గెట్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందించడం.. అందుకే వరి ఒక్కటే కాదు.. ఇతర పంటలను ప్రోత్సహిస్తున్నాం అని పేర్కొన్నారు. వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం.. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.