నిజాం కాలం నాటి నక్షాలకు మోక్షం..పైలట్‌ ప్రాజెక్టుగా 5 గ్రామాల్లో రీ సర్వే

రాష్ట్రంలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

By Knakam Karthik
Published on : 18 May 2025 6:35 PM IST

Telangana, Congress Government, Minister Ponguleti Srinivas reddy

నిజాం కాలం నాటి నక్షాలకు మోక్షం..పైలట్‌ ప్రాజెక్టుగా 5 గ్రామాల్లో రీ సర్వే

తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తర తరాలుగా నిజాం కాలం నుండి స‌ర్వే చేయ‌ని లేదా స‌ర్వే రికార్డులు లేని 413 గ్రామాలు ఉన్నాయని గత పది సంవత్సరాలలో ఈ సమస్యకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చూపలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలని నిర్ణయించిందని తెలిపారు. ఇందుకు గాను 413 గ్రామాల్లోని ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించి దానిలో వచ్చే ఫీడ్ బ్యాక్‌ను బట్టి మిగిలిన గ్రామాల్లో కూడా చేపడతామని తెలిపారు.

పైలెట్ గ్రామాలు

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గండీడ్ మండ‌లం స‌లార్ న‌గ‌ర్ , జగిత్యాల జిల్లా భీర్పూర్ మండ‌లం కొమ్మ‌నాప‌ల్లి (కొత్త‌ది) గ్రామం, ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం మండ‌లం ములుగుమ‌డ , ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను ఎంపిక చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయా గ్రామాల‌లో ఆధునిక సాంకేతిక‌ను వినియోగిస్తూ రెండు ప‌ద్దతుల‌లో విస్తృత స‌ర్వే జ‌రుగుతుందని, ఏరియ‌ల్‌/ డ్రోన్ స‌ర్వే ప‌ద్ద‌తి, ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ ప‌ద్ద‌తుల్లో స‌ర్వే చేసి జియో రిఫ‌రెన్డ్స్‌, క్యాడ‌స్ట్ర‌ల్ మ్యాపులు, హక్కుల న‌మోదు ప‌త్రాల‌ను త‌యారుచేస్తారని తెలిపారు.

ఈ నూత‌న విధానాల వ‌ల‌న భూమి స‌మాచారం, పార‌దర్శ‌క‌త‌, వివాద ప‌రిష్కారం, భూ యాజ‌మాన్యంలో స్ప‌ష్ట‌త వ‌స్తుంది, ఫ‌లితంగా రైతులు, గ్రామీణ భూ య‌జ‌మానుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం కలుగుతుందన్నారు. ఈ రీ స‌ర్వే కోసం వివిధ రాష్ట్రాల‌లో రీ స‌ర్వే లో అనుభ‌వం క‌లిగిన ఆర్వీ అసోసియేట్స్, మార్వెల్ జియో స్పేషియ‌ల్‌, ఐఐసి టెక్నాల‌జీస్‌, నియో జియో, డ్రోగో డ్రోన్ సంస్థలను ఎంపిక చేశామ‌ని మంత్రి తెలిపారు. పైలట్ గ్రామాల్లో ఈ సంస్ధ‌లు రీ స‌ర్వే చేస్తాయ‌ని, స‌ర్వే ఫ‌లితాల ఆధారంగా మిగిలిన గ్రామాల‌కు విస్త‌రిస్తామ‌ని మంత్రి పొంగులేటి వెల్ల‌డించారు. ఆధునిక యంత్రాలు, టెక్నాలజీని వాడుకుని శాశ్వతంగా భూ సమస్యలను పరిష్కరించే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Next Story