తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది. పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్-ఎ సవరించాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే 285 క్లాజ్-ఎ సెక్షన్‌లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అమలవుతాయని ఉంది. అందులో 50 శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగిస్తూ చట్టాన్ని సవరించాలని నిర్ణయించారు.
పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు (సెప్టెంబర్ 30) సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ ఈ ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత మంత్రి, ముఖ్యమంత్రి ఆమోదంతో ప్రభుత్వం రాజ్‌భవన్‌కు ఆర్డినెన్స్ ముసాయిదాగా పంపించింది. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందితే చట్ట సవరణ వెంటనే అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి, స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు పంపించనుంది. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే