తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న రైతు భరోసాపై కీలక అప్‌డేట్ వచ్చింది. యాసంగి సీజన్ రైతు భరోసా సాయాన్ని త్వరలోనే రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా, ఆపైన ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం రూ.4వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
అయితే కొంతమంది రైతులకే రైతు భరోసా ద్వారా పంట సహాయం అందడంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్ పూర్తయినప్పటికీ కూడా ఇంకా రైతు భరోసా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలలో పంట పెట్టుబడి సహాయం జమ అయ్యింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగు ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేశారు. కాగా పెండింగ్ లో ఉన్న యాసంగి రైతు భరోసా డబ్బులను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మే రెండో వారంలోగా ప్రతి రైతుకు రైతు భరోసా అందించే విధంగా అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు.