వారికి రైతుభరోసా బంద్..సీఎం రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తోంది

By -  Knakam Karthik
Published on : 24 Dec 2025 9:54 AM IST

Telangana, Congress Government,  Rythu Bharosa scheme, Cm Revanthreddy

వారికి రైతుభరోసా బంద్..సీఎం రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తోంది. మరికొద్ది రోజుల్లో యాసంగీ సీజన్‌కు సంబంధించి 'రైతు భరోసా' పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. అయితే ఈ పథకంలో ప్రభుత్వం కీలక మార్పు చేసినట్లు సమాచారం. ఈసారి యాసంగిలో పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే దాదాపు 10 లక్షల ఎకరాల భూములకు పెట్టుబడి సాయం నిలిచిపోనుంది. దీని వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గి, సాగు చేసే రైతులకే లబ్ధి చేకూరనుంది.

ఈ పథకం అమలు, మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇకపై రైతు భరోసా నిధులను కేవలం సాగు చేసే రైతులకే అందించాలని ఆయన ఆదేశించారు. సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లుగా ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. రైతన్నలకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు రూ.8 వేలు మొదట చెల్లించింది. ఆ తర్వాత పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేలకు పెంచింది. అయితే, ఈ పథకంలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు పొందినట్లు గుర్తించారు.

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్పు చేస్తూ, ఎకరాకు పెట్టుబడి సాయం రూ.6 వేలకు పెంచింది. ఈ పథకం ద్వారా అనర్హులు సైతం లబ్ధి పొందుతున్నారని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో అర్హులైన రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది. సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు.

Next Story