గుడ్‌న్యూస్..మహిళా సంఘాలకు అద్దె బస్సులు, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది.

By Knakam Karthik
Published on : 4 March 2025 1:49 PM IST

Telangana, Congress Government, Cm Revanthreddy, Womens Groups, RTC rental buses

గుడ్‌న్యూస్..మహిళా సంఘాలకు అద్దె బస్సులు, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మహిళ సంఘాలకు ఉపాధి కల్పనలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనుంది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రతి నెల ఒక్కో బస్సుకు రూ. 77, 220 అద్దె ఆర్టీసీ చెల్లించనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8 న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారుల సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో నూతన యుగం మొదలైందని మంత్రి సీతక్క అభివర్ణించారు. మహిళా సంఘాలకు స్వావలంబన కల్పించే వినూత్న నిర్ణయమన్నారు. అద్దె బస్సుల కేటాయింపుతో మహిళల అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడిందన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.

Next Story