సింగరేణి కార్మికులకు తెలంగాణ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లాభాల్లో 32 శాతం బొగ్గు కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  26 Sep 2023 2:45 PM GMT
సింగరేణి కార్మికులకు తెలంగాణ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లాభాల్లో 32 శాతం బొగ్గు కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సింగ‌రేణి కార్మికులకు అందించిన అతిపెద్ద బహుమతి ఇదే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా SCCL ఆర్జించిన లాభంలో 32 శాతాన్ని బోనస్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారిని ఆదేశిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సింగ‌రేణి ఉద్యోగులకు సంస్థ ఇస్తున్న లాభాల వాటాను ఏటా పెంచుతూ వస్తోంది. దేశంలోని బొగ్గు కార్మికులకు ఇచ్చే అతిపెద్ద దసరా కానుకగా ఇది ఓ రికార్డ్ కావ‌డం విశేషం. ఈ ప్రకటనతో రాష్ట్రంలోని 11 ప్రాంతాలలో బొగ్గు కార్మికులు సంబరాల్లో మునిగిపోయారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం (TBGKS) గౌరవ అధ్యక్షురాలు కె.కవిత బొగ్గు కార్మికుల తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం కార్మికులకు ఇస్తున్న లాభాల వాటాను ముఖ్యమంత్రి పెంచుతూ బొగ్గు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. 11వ వేజ్ బోర్డు బకాయిలను సింగరేణి యాజమాన్యం గత వారంలో సింగరేణి కార్మికులకు రూ.1450 కోట్లు జమ చేసింది.

Next Story