పద్మశాలీలకు సర్కార్ గుడ్‌న్యూస్, ఆ భవనం కోసం రూ.కోటి ప్రకటన

తెలంగాణలో కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమైతే.. అది నచ్చనివారే సర్వే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

By Knakam Karthik  Published on  9 March 2025 4:44 PM IST
Telangana, CM Revanthreddy, Markandeya Building, Congress Government, Akhila Bharatha Padmasali Mahasabha,

పద్మశాలీలకు సర్కార్ గుడ్‌న్యూస్, ఆ భవనం కోసం రూ.కోటి ప్రకటన

తెలంగాణలో కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమైతే.. అది నచ్చనివారే సర్వే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పద్మశాలి మహాసభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కులగణనతో బీసీలకు న్యాయం చేయాలన్నది రాహుల్ గాంధీ ఆశయం అని, తెలంగాణ వ్యాప్తంగా పకడ్బందీగా కులగణన చేశామని స్పష్టం చేశారు. కులగణనలో తప్పు ఎక్కడ జరిగిందో నిరూపించమంటే ఎవరూ రావడంలేదని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేస్తూ, బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీది కీలకపాత్ర అని వెల్లడించారు. ఉద్యమం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. నీడ లేని వాళ్లకు తన ఇల్లు ఇచ్చారని వివరించారు. అలాంటి మహనీయుడిని, తెలంగాణ వచ్చాక పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మాజీ సీఎం వెళ్లలేదని పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ప్రకటించారు.

పద్మశాలిలు ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకూ అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయంతో పని చేస్తున్నదన్నారు. పద్మశాలీలు ఆత్మగౌరవంలోనే కాదు, త్యాగంలోనూ ముందుటారని అలాంటి పద్మశాలీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. టైగర్ నరేంద్ర త్యాగం లేకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది నిజం అన్నారు. అలాంటి ఆలె నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా చేస్తే కేసీఆర్ అనే ధృతరాష్ట్రడు అలె నరేంద్ర పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడమే కాకుండా ఆయనను ఖతం చేసిన కథ పద్మశాలీలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలను రాజకీయంగా ప్రోత్సహించిందన్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా పద్మశాలీలను అభ్యున్నతే లక్ష్యమే మా ప్రభుత్వం విధానం అన్నారు.

మహారాష్ట్రలోని షోలాపూర్ లో మన పద్మశాలీలు చాలా మంది ఉన్నారని అక్కడ పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పద్మశాలిల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నానని సీఎం చెప్పారు. మీ సోదరుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు కావాల్సిన పనులు చేయించుకోండి. చేయించుకోకపోతే అది మీ తప్పే అవుతుంది. మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం అన్నారు. మీ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలతో రావాలని వాటిని ఆమోదించే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Next Story