ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించింది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘కార్బో వ్యాక్సిన్’ను బూస్టర్ డోసుగా అందించనున్నట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు 5 లక్షల డోసులను సిద్ధంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. మొదటి, రెండో డోసుగా కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లలో ఏది తీసుకున్నా, బూస్టర్ డోసుగా కార్బోవ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు.
అన్ని ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో (పిహెచ్‌సిలలో) పౌరులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాక్సిన్ డోస్ మిస్ అయిన వారు తెలంగాణలోని పబ్లిక్ హెల్త్ సెంటర్లలో వీటిని తీసుకోవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అభ్యర్థించారు.
మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 7,633 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 61,233కి పెరగగా, 11 మరణాలతో మరణాల సంఖ్య 5,31,152కి పెరిగింది. కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,48,34,859) కు చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.14% యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.68%గా ఉంది. ఏప్రిల్ 17 నాటికి తెలంగాణలో దాదాపు 8,43,003 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరణాల రేటు 0.49% కాగా, రికవరీ రేటు 99.48%గా ఉంది. కొత్త మరణాలు నమోదు కాకపోవడంతో మరణాల సంఖ్య 4,111గా ఉంది.