Telangana: రేపే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. ఇదిగో కీలక హామీలు

తెలంగాణ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Nov 2023 7:10 PM IST
telangana, elections, congress, manifesto,

Telangana: రేపే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. ఇదిగో కీలక హామీలు

తెలంగాణ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల మద్దతుకూడగట్టుకోవడం కోసం ఎన్నికల మేనిఫెస్టోను అస్త్రంగా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.విద్యార్థులు, యువత, రైతులు, పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు, మహిళలు, జర్నలిస్టులు, పేదలు, నిరాశ్రయులైన తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, న్యాయవాదులు వీరందరికీ వాగ్ధానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. సిఎం క్యాంపు కార్యాలయంలో 'ప్రజా దర్బార్' పునరుద్ధరణతో పాటు.. అధికారంలోకి వస్తే ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలోని 16 మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఒకటి, రెండు రోజుల్లో పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ ప్రకటించిన ఆరు హామీలకు (అభయ హస్తం ప్రతిజ్ఞ) అదనం.

మహిళలకు రూ.లక్ష, 10 గ్రాముల బంగారం

ఇందిరమ్మ బహుమతి పథకం కింద అర్హులైన మహిళలందరికీ వివాహ సమయంలో లక్ష రూపాయల నగదు, 10 గ్రాముల బంగారం, విద్యార్థులందరికీ ఉచిత ఇంటర్నెట్, 18 ఏళ్లు నిండిన కళాశాలకు వెళ్లే మహిళలందరికీ ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు, రూ. 100 కోట్ల జర్నలిస్టు నిధి, రైతులకు రూ.2 లక్షల పంట రుణాల మాఫీ మొదలైనవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవినీతిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ చేపడతామని పార్టీ హామీ ఇచ్చింది.

ప్రజా దర్బార్ పునరుద్ధరణ:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అక్కడికక్కడే ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ప్రజా దర్బార్ పెద్ద విజయాన్ని సాధించింది. ప్రజలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చేవారు. వీలైనంత త్వరగా పరిష్కారాన్ని చూపేవారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన సిఎం క్యాంపు కార్యాలయం, నివాసం ప్రగతి భవన్‌ను ఓ కోటలాగా మార్చుకున్నారని.. సాధారణ ప్రజలకు దూరంగా ఉన్నారనే విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. కనీసం కార్యకర్తలకు కూడా కేసీఆర్ దూరమయ్యారనే ప్రచారం సాగుతోంది.

శ్రీధర్ బాబు కమిటీ:

మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని 16 మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ రాష్ట్రంలోని అన్ని రంగాలు, వర్గాలకు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను ఖరారు చేసేందుకు దాదాపు నెల రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తోంది. ఈ మేనిఫెస్టోకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆమోదం తెలిపింది. విద్య, ఉపాధి, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఆరోగ్యం, పర్యాటకం మొదలైన అన్ని రంగాలను కవర్ చేసే దాదాపు 40 అంశాలను కలిగి ఉన్న మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ప్రజల ముందుకు రానుంది.

మేనిఫెస్టోలోని అన్ని ప్రధాన వాగ్దానాల జాబితా:

- ఇందిరమ్మ బహుమతి పథకం కింద వివాహ సమయంలో అర్హులైన మహిళలందరికీ రూ.1 లక్ష, 10 గ్రాముల బంగారం.

- విద్యార్థులందరికీ ఉచిత ఇంటర్నెట్

- 18 ఏళ్లు నిండిన కళాశాలకు వెళ్లే అమ్మాయిలకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు.

- విద్యా భరోసా కార్డు కింద ప్రతి కళాశాలకు వెళ్లే విద్యార్థికి రూ. 5 లక్షలు.

- ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షలు, అన్ని ప్రధాన వ్యాధులను కవర్ చేస్తుంది.

- జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ.100 కోట్లు.

- మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి రూ.2 లక్షలు, హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.

- వికలాంగులందరికీ ఉచిత రవాణా.

- పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

- ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ, హెరిటేజ్ ట్యాగ్‌తో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని పునరుద్ధరించడం.

- ఇళ్లు లేని పేదలకు ఒక్కొక్కరికి 5 లక్షలు.

- ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి ఇళ్ల స్థలాలు ఉంటే రూ.6 లక్షలు.

- ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు.

- ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.

- ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం.

- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ప్రకటన.

- బాసర తరహాలో 4 ఐఐఐటీల ఏర్పాటు.

- రూ.2 లక్షల పంట రుణాలు ఒకేసారి మాఫీ.

- రూ. 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణం.

- వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు నిరంతరాయ ఉచిత విద్యుత్.

- అన్ని ప్రధాన పంటలకు సమగ్ర పంట బీమా.

- యాదవ, కుర్మ సంఘాల సభ్యులకు మేకలు, గొర్రెల పెంపకం కోసం నేరుగా రూ.2 లక్షలు.

- నిర్మాణ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో కార్మికులు మొదలైన గుర్తింపు లేని రంగ కార్మికులందరికీ సామాజిక భద్రతా వ్యవస్థ.

- ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొందే అన్ని ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.

- సమ్మక్క సారక్క పండుగను జాతీయ పండుగగా గుర్తించాలి.

- ధరణి వల్ల నష్టపోయిన రైతులందరినీ కవర్ చేయడానికి భూమాత పోర్టల్ అని పిలువబడే ధరణి పోర్టల్ కంటే పారదర్శక ఉన్న కొత్త వెర్షన్.

- కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15,000.

- వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12,000.

- తెలంగాణ అమరవీరుల తల్లి, తండ్రి, జీవిత భాగస్వామికి నెలకు రూ. 25,000 గౌరవ పెన్షన్‌తోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం.

- తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా నమోదైన వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి.

- గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులను సర్పంచ్‌ల ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం పునరుద్ధరణ.

- భూమిలేని పేదల పథకం కింద 25 లక్షల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు యాజమాన్య హక్కుల పునరుద్ధరణ.

- 50 శాతం తగ్గింపుతో పెండింగ్‌లో ఉన్న పోలీసు చలాన్‌లను వన్‌టైమ్ సెటిల్‌మెంట్.

- అన్ని బెల్ట్ షాపుల మూసివేత.

- రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులాల గణన.

- సరిపడా నిధులతో కొత్త మైనారిటీ సంక్షేమ బోర్డు.

- ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి, ప్రజా ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించడానికి పోర్టల్.

- ఎక్సైజ్ పాలసీ సమీక్ష.. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు, కళాశాలలు మొదలైన వాటి చుట్టూ మద్యం దుకాణాలపై నిషేధం.

Next Story