ఇప్పటికీ ఆ 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు బోణీ కష్టమేనా..?
గులాబీ పార్టీ ఆ 17 నియోజకవర్గాల్లో మాత్రం బోణీ కొట్టలేకపోయింది.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 11:09 AM ISTఇప్పటికీ ఆ 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు బోణీ కష్టమేనా..?
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రెండు సార్లు ఏర్పడింది. అయితే.. 2018లో మాత్రం రెండోసారి తిరుగులేని విజయం సాధించింది ఇప్పుడు బీఆర్ఎస్‌గా ఉన్న అప్పటి టీఆర్ఎస్. కానీ.. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గులాబీ పార్టీ ఆ 17 నియోజకవర్గాల్లో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. వరుసగా కారు బోల్తా పడుతూనే ఉంది.
రాష్ట్రంలో ఉండే ఏడు మజ్లిస్ స్థానాలు పక్కన పెడితే.. మిగిలిన 10 స్థానాల్లో కారుకి ప్రతిసారి డ్యామేజ్ అవుతూనే ఉంది. వాటీలో ఎక్కువ సీట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవే. ఈ జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు. ఈసారి అయినా బోణీ కొడుతుందా అని అంటే మళ్లీ కష్టమే అనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలు కాకుండా.. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఎల్‌బీనగర్ స్థానాల్లోనూ గులాబీ పార్టీ విజయం సాధించలేదు. ఆ రెండు స్థానాల్లో 2018 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. అలాగే గోషామహల్ నుంచి 2014, 2018 ఎన్నికల్లో కారుకి డ్యామేజ్ అవుతూనే ఉంది.
పినపాక: ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేగా కాంతారావు.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. దాంతో.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అంటుంటే.. తమకు ఇక్కడ బలం ఉందని ప్రజలు తమవైపే ఉన్నారంటూ కాంగ్రెస్ దీమాగా చెబుతోంది.
కొత్తగూడెం: బీఆర్ఎస్ నుంచి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. హస్తం పార్టీ నుంచి జలగం వెంకటరావు బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ.. సీపీఐతో కాంగ్రెస్ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఇక్కడ టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భద్రాచలం: కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య బరిలోకి దిగారు. ఆయనపై వ్యతిరేకత పెద్ద లేదు. దాంతో.. బీఆర్ఎస్‌కు ఈ స్థానంలో కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పొదెం వీరయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చిన పార్టీని వీడలేదు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిచెందిన తెల్లం వెంకటరావు మరోసారి బరిలో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్‌ను ఓడించి గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్‌ఎస్ ధీమాగా చెబుతోంది.
అశ్వారావు పేట: కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. 2018 ఎన్నికల్లో.. కాంగ్రెసతో పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు.. గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచే ఆయన పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగనక ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెడితే బీఆర్‌ఎస్‌కు కష్టమే. కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కోసం ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు ఆశావహులున్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ పొంగులేటి వర్గానికి చెందిన జారె ఆదినారాయణ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వర్గానికి చెందిన సున్నం నాగమణి.
సత్తుపల్లి : ఇక్కడ టీడీపీకి ఎక్కువ బలం ఉంటుంది. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన సండ్ర వెంకట వీరయ్య గెలిచి.. ఆ తర్వాత బీఆరెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచినా.. ఇప్పుడు గులాబీ పార్టీ నుంచే పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలిస్తేనే పోటీ ఎంత బలంగా ఉండేదీ తేలుతుంది. కాంగ్రెస్ నుంచి డాక్టర్ దయానంద్ సతీమణి రాగమయి, మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్, కొండూరు సుధాకర్, మానవతారాయ్ తదితరులు టికెట్ ఆశిస్తున్నారు.
మధిర: ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలం ఎక్కువ. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా భట్టి విక్రమార్కతో ఆయనే తలపడుతున్నారు.
పాలేరు: ఇక్కడ గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి కందాల ఉపేందర్‌రెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఉపేందర్‌రెడ్డిపై మాజీ ఎంపీ పొంగులేటి బరిలోకి దిగారు. ఎప్పట్నుంచో ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. దాంతో.. పొంగులేటి, కందాల మధ్య గట్టి పోటీ సాగుతోంది.
వైరా: ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో ఇప్పటివరకూ గులాబీ జెండా ఎగరలేదు. ఈసారి ఎలాగైనా గెలవాలని బీఆర్‌ఎస్ పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన బానోతు మదన్‌లాల్ ఈసారి కూడా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్ బీఆర్‌ఎస్‌లో చేరినా ఆయనకు టికెట్ దక్కలేదు. ఇక.. ఇక్కడ ఎవరిని నిలపాలనే విషయమై కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇల్లందు: ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన బానోతు హరిప్రియ.. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచే బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కోరం కనకయ్య పేరు కాంగ్రెస్ నుంచి వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పేరు కూడా ప్రచారంలో ఉంది.
ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. దూకుడుగా ప్రచారపర్వం సాగిస్తున్నారు. ఒకసారి కాంగ్రెస్ నుంచి, ఒకసారి టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన పువ్వాడ.. హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
మహేశ్వరం (రంగారెడ్డి): ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితాఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2018లో సబితకు 40.76 శాతం ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డికి 36.82 శాతం ఓట్లు లభించాయి. మరోసారి సబితనే ఇక్కడ బరిలోకి దిగుతున్నారు. మంత్రి సబితకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని పోటీకి దింపింది. ఇద్దరి మధ్య పోటీ నెలకొంటుందని చెబుతున్నారు.
ఎల్‌బీనగర్: ఇక్కడ కూడా కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన సుధీర్‌రెడ్డి తరువాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధి సుధీర్‌రెడ్డికి 44.66 శాతం ఓట్లు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్ధి రామ్మోహన్‌గౌడ్‌కు 43.33 శాతం ఓట్లు వచ్చాయి. సుధీర్‌రెడ్డిపై మధుయాష్కీగౌడ్‌ని కాంగ్రెస్ పోటీకి దింపింది. దాంతో.. ఇక్కడ కూడా గట్టి పోటీ ఉండనుంది.