తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన ఇంటరిమ్ అప్లికేషన్ (IA) పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో డీజీపీ శివధర్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది.
అయితే డీజీపీ నియామకానికి సంబంధించి రెగ్యులర్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీ (UPSC) ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తిచేయాలని స్పష్టం చేసింది.
యూపీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. నియామక ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.