సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. అల్లు అర్జున్‌పై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా డీజీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం.. మేం అల్లు అర్జున్‌కి వ్యతిరేకం కాదు.. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకున్నామన్నారు. అన్నింటికంటే పౌరుల భద్రతే ముఖ్యం.. ఆయన సినిమా హీరో కావచ్చు కానీ, ఇలాంటి సంఘటనలు పౌరుల భద్రతకు హానికరం అని అర్థం చేసుకోవాలన్నారు.
జర్నలిస్టుపై దాడికి సంబంధించి సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల భద్రత కోసం 24 గంటలు పనిచేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం చొరవతో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. మహిళలు ఎలాంటి సమస్యకైనా భరోసా కేంద్రాలను ఆశ్రయించవచ్చు. ఈ కేంద్రాల్లో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు, పరిష్కారాలు అందించేందుకు న్యాయ నిపుణులు, వైద్యులు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు.