గ్రూప్-2 పరీక్షలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ శుక్రవారం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది.
By Medi Samrat Published on 19 July 2024 8:33 PM ISTతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ శుక్రవారం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవిని గ్రూప్ 2 ఉద్యోగాల అభ్యర్థులు కలిశారు. డీఎస్సీ పరీక్షకు కూడా హాజరవుతున్నందున.. గ్రూప్ 2 పరీక్షకు సిద్ధం కావడానికి తమకు రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని.. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని ఉద్యోగ ఆశావహులు డిప్యూటీ సీఎం విక్రమార్కను కోరారు.
TGPSC మార్చి 2024లో 783 గ్రూప్ 2 పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సి ఉంది. వాయిదా పడిన నేపథ్యంలో.. ఇప్పుడు డిసెంబర్‌లో పరీక్షలు జరగనున్నాయి. అయితే తేదీలను తర్వాత ప్రకటించనుంది. ఉద్యోగ అభ్యర్ధులకు అనుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క.. పరీక్షలు ఒకదానికొకటి క్లాస్ అవకుండా చూసేందుకు త్వరలో జాబ్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేస్తామని చెప్పారు.
గత మూడు నెలల్లో ప్రభుత్వ శాఖల్లో 54 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని.. గత పదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని వేగంగా చేపట్టి ఉంటే లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడి ఉండేవని విక్రమార్క అన్నారు. గ్రూప్ 2 పోస్టులను పెంచాలన్న తమ డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తోందని డిప్యూటీ సీఎంను కలిసిన ఉద్యోగ ఆశావహులు తెలిపారు.