మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సెప్టెంబర్ 30, సోమవారం నాడు బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. తెలంగాణ భవన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపు తోపులాట కూడా జరిగింది.
కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతమంది కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.