ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నాం: సీఎం రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే పని చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik
ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నాం: సీఎం రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే పని చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఈ ఏడాది ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని భావిస్తున్నానని తెలిపారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి అన్నప్పుడు అడ్డంకులు రావడం సహజమేనని పేర్కొన్నారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ షడ్రుచుల కలయికలా ఉంది. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే ఆయన ఆలోచన. బడ్జెట్‌లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించాం. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలి. దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. మూసీ ప్రక్షాళన, ప్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నాం. ప్యూచర్ సిటీ.. ప్రజలు నివసించే నగరమే కాదు.. పెట్టుబడుల నగరం. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుంది. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవు. ఏ విధానానికీ నూటికి నూరు శాతం ఆమోదం ఉండదు.
ఇక, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి పండిందని, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇంత వరి పండలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. రేషన్ లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, మన రైతులు పండించిన పంటను పేదలకు పంచబోతున్నామని చెప్పారు.