గిగ్‌ వర్కర్లకు చట్టం..ముసాయిదాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

By Knakam Karthik
Published on : 14 April 2025 5:42 PM IST

Telangana, Congress Government, Cm Revanthreddy, Review On Gig Workers Safety

గిగ్‌ వర్కర్లకు చట్టం..ముసాయిదాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్ళులు రామకృష్ణారావు, జయేష్ రంజన్, సంజయ్​ కుమార్​ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్​ వర్కర్స్ బిల్లు ముసాయిదాను తయారు చేసింది. అందులో పొందుపరిచిన అంశాలను అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. తయారు చేసిన ముసాయిదాకు పలు మార్పులు చేర్పులను ముఖ్యమంత్రి సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వటంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం, సుహృద్భావం ఉండేలా కొత్త చట్టం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ బిల్లు ముసాయిదాను వెంటనే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచి, ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్స్ డ్రైవర్లు, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని, అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. వీటితో పాటు అధికారులు ఈ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలపై తుది కసరత్తు చేయాలని, అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈనెల 25వ తేదీ నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసే అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే డే రోజున ఈ బిల్లును అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దేశంలోనే మొదటి సారిగా గిగ్​ వర్కర్లకు ప్రమాద బీమాను అమలు చేశామని చెప్పారు. గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించేలా 2023 డిసెంబర్ 30న తమ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు.

Next Story