తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే ఢిల్లీతోనైనా పోరాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఢిల్లీనైనా ఎదుర్కొంటానని, నిధుల కోసం వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు.
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి నిధులు అడగడం, అనుమతులు కోరడం ముఖ్యమంత్రిగా తన బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయాల కోసం ఎంత దూరమైనా వెళ్లే ఓపిక, వయస్సు తనకు ఉన్నాయని, సమస్యను వివరించే పరిజ్ఞానం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.