తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. స్టాలిన్‌ను యాదాద్రి ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. దేశంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై ఇద్దరు సీఎంలు చర్చించారు. తమిళనాడుకు కుటుంబ సమేతంగా విచ్చేసిన సీఎం కేసీఆర్‌ను సీఎం స్టాలిన్ సాదరంగా ఆహ్వానించారు. అలాగే మంత్రి కేటీఆర్.. స్టాలిన్ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధితో సమావేశమయ్యారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని, దీనిపై స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి.
తమిళనాడు సీఎంతో రాష్ట్రాల హక్కులను కాపాడుకునే విషయమై కలిసి పని చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. దశాబ్దాల నుండి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ద్రవిడ వాదాన్ని బలంగా వినిపిస్తూ వస్తున్నాయి. కాగా సీఎం కేసీఆర్ తన పర్యటనలో ఈ రెండు పార్టీల నిర్మాణాన్ని కూడా పరిశీలించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ తన కుటుంబ సమేతంగా శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. నిన్న రాత్రి చెన్నైలో బస చేశారు. ఇదిలా ఉంటే చెన్నైలోనే ఉన్న మాజీ రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను సీఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు సమాచారం.