తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు తీపి కబురు వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా ఉద్యోగులలో ఆశలు రేపుతున్న పీఆర్సీపై సోమవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా సమాచారం. అయితే సాధారణ ప్రకటన చేస్తారా..? లేక అసెంబ్లీలో ప్రకటన చేస్తారా? అనేది ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శుభవార్త అందిస్తారని విశ్వసనీయ సమాచారం. వేతన సవరణతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం మాదిరిగానే తెలంగాణ సర్కార్ కూడా ఈహెచ్‌ఎస్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం తదిర అంశాలపైన కేసీఆర్ ప్రకటన చేస్తారని ఉద్యోగులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. సమావేశంలో ఏపీ సర్కార్ ప్రకటించిన మధ్యంతర భృతి కన్నా రెండు శాతం ఎక్కువే ఫిట్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దీంతో కనీసం 29 నుంచి 33 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందని ఉద్యోగుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై కేసీఆర్ హామీ ఇచ్చారని, ఈ హామీని కూడా కేసీఆర్ నిలబెట్టుకుంటారని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు టీఆర్‌ఎస్ కైవనం చేసుకోవడంతో ఇదే జోష్‌లో కేసీఆర్ ఉద్యోగుల హామీపై కీలక ప్రకటన చేస్తారని అభిప్రాయపడుతున్నారు.