అక్కడి పరిస్థితులపై ఆరా తీసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో చోటు చేసుకుంటున్న ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం ఆరా తీశారు.

By Medi Samrat  Published on  21 May 2024 5:00 AM GMT
అక్కడి పరిస్థితులపై ఆరా తీసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో చోటు చేసుకుంటున్న ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం ఆరా తీశారు. భారతీయ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇక భారతీయ విద్యార్థుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కోరారు.

బిష్కెక్‌ లో జరుగుతున్న పరిణామాలపై సిఎం అడిగిన తర్వాత.. సీనియర్ అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీని సంప్రదించి వివరాలు సేకరించినట్లు సీఎం సిపిఆర్‌ఓ ట్విట్టర్ లో తెలిపారు. "అత్యున్నత అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీని సంప్రదించి వివరాలను సేకరించారు. భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఏదైనా అత్యవసర పరిస్థితికి స్పందించడానికి ఎంబసీ హెల్ప్‌లైన్ ను సంప్రదించాలని హామీ ఇచ్చారు" అని ఆయన చెప్పారు. "ప్రస్తుతం, విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. భారతీయ విద్యార్థులందరూ ప్రిపరేషన్ మోడ్‌లో ఉన్నారు. ఈ సంఘటనలో భారతీయ విద్యార్థి ఎవరూ తీవ్రంగా గాయపడలేదని లేదా ఆసుపత్రిలో చేరలేదని ధృవీకరించాము. చాలా సోషల్ మీడియా పోస్ట్‌లు అవాస్తవమని తేలింది" అని CPRO తెలిపింది.

అక్కడి పరిస్థితి మెరుగుపడకపోతే భారతీయ విద్యార్థులను తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. భారతీయ విద్యార్థులు తమను తాము రక్షించుకోవడానికి హాస్టల్స్ లోనే ఉంటున్నారని.. ఆహారం వారికి అందుబాటులో లేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. "కిర్గిస్థాన్ లోని కొంతమంది స్థానికులు భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతూ ఉన్నారు. గత ఐదు రోజులుగా వారు భోజనం చేయడం లేదని ఒక విద్యార్థి నా వద్దకు వచ్చాడు. దయచేసి అక్కడ ఉన్న మన ప్రజలను రక్షించడానికి పటిష్ట చర్యలు తీసుకోండి. వారి కోసం ఏర్పాట్లు చేయాలి. పరిస్థితి మెరుగుపడ్డాక తిరిగి పంపండి" అని ఒవైసీ అన్నారు.

మే 18న.. కిర్గిస్థాన్ రాజధాని నగరం కొంతమంది స్థానికులు, విదేశీయుల మధ్య గొడవలు జరిగాయి. బిష్కెక్‌లోని విద్యార్థులను బయటకు రావద్దని భారతదేశ విదేశాంగ శాఖ కోరింది. మధ్య ఆసియా దేశంలోని భారత రాయబార కార్యాలయం భారతీయ విద్యార్థులతో టచ్‌లో ఉందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపింది. కిర్గిస్థాన్‌, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్‌ అయ్యాయి. అక్కడ భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ విద్యార్థులు నివసించే బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లపై దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వచ్చాయి. దీంతో భారతదేశానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన మొదలైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కిర్గిస్థాన్ లో చదువుకుంటూ ఉన్నారు.

Next Story