సీఎం అయ్యాక తొలిసారి ప్ర‌ధాని మోదీని క‌లిసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీని క‌లిశారు

By Medi Samrat  Published on  26 Dec 2023 5:33 PM IST
సీఎం అయ్యాక తొలిసారి ప్ర‌ధాని మోదీని క‌లిసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీని క‌లిశారు. ఆయ‌న వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ప్ర‌ధానిని క‌లిశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. ముఖ్యమంత్రి తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. ఈ స‌మావేశంలో విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించిన‌ట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి ప్రధాని మోదీకి నివేదిక స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తుంది.


అంత‌కుముందు డిప్యూటీ సీఎం భ‌ట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు రావలసిన హామీలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన బకాయిల గురించి ప్రధాని మోదీని కలుస్తున్నామని చెప్పారు. దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు రావలసిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచింగ్, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. తెలంగాణలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ఆర్థిక పురోగతిపై ప్రధాని మోదీ తో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి నిధులను రాబట్టే ప్రయత్నం లో భాగంగా ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినందున పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడంతో పాటు రాష్ట్రం నుంచి ఆ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టే నిధులను ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించుకునే వెసులుబాటు దొరుకుతుందన్నారు.

Next Story