హైదరాబాద్: కొడంగల్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న బీఆర్‌ఎస్ నేత సురేశ్.. ఆ రోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ (క్లస్టర్) ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా సోమవారం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్-కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయకుమార్, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డిపై రైతులు, గ్రామస్థులు రాళ్లు, కర్రలతో దాడులు చేశారు.