స్థానిక ఎన్నికలపై సర్కార్ దృష్టి, రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్

డా.బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.

By -  Knakam Karthik
Published on : 16 Nov 2025 9:44 AM IST

Telangana, Hyderabad, Telangana Cabinet Meeting, Cm Revanthreddy, Local Elections

స్థానిక ఎన్నికలపై సర్కార్ దృష్టి, రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్

హైదరాబాద్: డా.బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌ ఎన్నికలో గెలుపొందిన ఉత్సాహంతో వచ్చే నెల చివరి లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన విజయోత్సవాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండల పరిషత్తు అధ్యక్షులు, 565 జిల్లా పరిషత్తులు, 5,749 ఎంపీటీసీలు, 12,733 పంచాయతీలు, లక్షా 12 వేల 288 వార్డు సభ్యులకు జరగాల్సిన ఎన్నికలు అర్ధాంతరంగా ఆగాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగురవేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇది కాంగ్రెస్‌కు లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల చివర లోపల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత లేకపోవడం, న్యాయస్థానంలో కేసు పెండింగ్‌ ఉండడం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని రేపు జరగనున్న కేబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story